Site icon NTV Telugu

South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే!

South West Monsoon

South West Monsoon

నైరుతి రుతుపవనాలు ఈసారి మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇవాళ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జులై 8 నాటికి భారత్ వ్యాప్తంగా విస్తరిస్తాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 1 లేదా ఆ తర్వాత రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. దీంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. అయితే 2009లో నైరుతి రుతుపవనాలు మే 23నే ప్రవేశించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. సెప్టెంబరు 17న రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమవుతుంది. ఆ తదుపరి నెల 15 నాటికి ఇది ముగుస్తుంది.

ఈసారి వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదు అవుతుందని ఐఎండీ ఏప్రిల్‌ నెలలోనే తెలిపింది. సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురిసే ఎల్‌నినో పరిస్థితులు లేవని చెప్పింది. భారత్‌లో 52 శాతం నికర సాగు భూమికి వానలే ఆధారం. భారత్‌లోని వ్యవసాయ ఉత్పత్తిలో దీని నుంచి 40 శాతం దిగుబడి వస్తుంది. ఇండియాలో ఆహార భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతు పవనాలది ప్రధాన పాత్ర. ‘నాలుగు నెలల రుతుపవన కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంమీలో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాం’ అని అధికారులు అప్పట్లో ప్రకటించారు.

Also Read: Miss World 2025: మరికాసేపట్లో గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం.. షెడ్యూల్‌ ఇదే!

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా భారతదేశంలో దాదాపు 87 సెంమీ వర్షం పడుతుంది. దీనిని దీర్ఘకాలిక సగటు అంటారు. ఈ సంవత్సరం మాత్రం మొత్తం వర్షపాతం 87 సెంమీలో 105 శాతం ఉంటుందని అంచనా వేశారు. అంటే 91.35 సెంమీ వర్షపాతం పడుతుందని అంచనా వేసినట్లు లెక్క. దేశ వ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి నైరుతి రుతుపవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Exit mobile version