South Africa Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం నమోదయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. సెమీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రొటీస్.. మొదటిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పురుషుల జట్టు కూడా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
సెమీస్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (44; 42 బంతుల్లో 2×4) టాప్ స్కోరర్. ఎలిస్ పెర్రీ (31; 23 బంతుల్లో 2×4), తాలియా మెగ్రాత్ (27; 33 బంతుల్లో 3×4) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్ అయబోంగా ఖకా (2/24) రాణించింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అనెకె బాష్ (74 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వోల్వార్ట్ (42; 37 బంతుల్లో 3×4, 1×6) మంచి ఆరంభం ఇచ్చింది.
Also Read: Nani : నేను ‘నాయుడి గారి తాలూకా’ అంటున్న నాని
అనెకె బాష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. విజయం అనంతరం దక్షిణాఫ్రికా ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటిసారి కావడం విశేషం. నేడు రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్, విండీస్ జట్లు తలపడనున్నాయి. షార్జా మైదానంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.