T20 World Cup 2024 South Africa Squad: అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సీఎస్‌ఏ మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాకు మార్‌క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ టీ20 ప్లేయర్స్, సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.
ఇటీవల సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అన్రిచ్ నోర్జ్, క్వింటన్ డికాక్‌లకు సీఎస్‌ఏ టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు ఇచ్చింది. వెన్ను గాయం కారణంగా సెప్టెంబర్ 2023 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు నోర్జ్ దూరంగా ఉన్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత వన్డేలకు డికాక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టెస్ట్ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడు. ఇటీవల సౌతాఫ్రికా 20 టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ర్యాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్‌మాన్‌లకు కూడా చోటు దక్కింది.
క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్‌లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. కగిసో రబాడ, గెరాల్డ్ కోయెట్జీలతో మార్కో జాన్సెన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనునాడు. జార్న్ ఫోర్టుయిన్, కేశవ్ మహారాజ్ మరియు తబ్రైజ్ షమ్సీలు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా ఉన్నారు. ఇక పేసర్ లుంగి ఎన్గిడికి జట్టులో చోటు దక్కలేదు.
దక్షిణాఫ్రికా జట్టు:
ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జ్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ ట్రిస్టన్ స్టబ్స్.
ట్రావెల్ రిజర్వ్: నాంద్రే బర్గర్, లుంగి ఎన్గిడి.