NTV Telugu Site icon

ICC Cricket World Cup 2023: రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన సౌతాఫ్రికా..

Cricket

Cricket

ICC Cricket World Cup 2023: వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది సౌతాఫ్రికా జట్టు.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైనప్పటి నుండి అనేక జట్లు తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనలను ఆవిష్కరించాయి. కానీ, ఈ రోజు ప్రపంచకప్‌ 2023లో జరిగిన శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ ప్రత్యేకం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంకపై ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.. దీంతో.. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా పేరున ఉన్న రికార్డును దక్షిణాఫ్రికా బద్దలుకొట్టింది. ఇక, ఒకే ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్స్‌ సెంచరీలు బాదటం మరో హైలైట్.. మూడు సెంచరీలతో 400కు పైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా మరో రికార్డుకు ఎక్కింది సౌతాఫ్రికా..

Read Also: Hamas Attack On Israel: “ఈ దాడి గర్వంగా ఉంది”.. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు..

ఢిల్లీ వేదికగా ఈ రోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్స్‌ క్వింటన్‌ డికాక్‌ (100), రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌.. ఐడెన్ మార్‌క్రమ్‌ సెంచరీలతో కదం తొక్కారు.. ఇక, వరల్డ్‌ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు మార్‌క్రమ్‌.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి చెలరేగిపోయాడు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహకారంతో 100 పరుగులు చేశాడు.. ఇక, వాన్ డెర్ డస్సెన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108 పరుగులు బాదాడు.. ఆ తర్వాత ఐడెన్ మార్‌క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. కేవలం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదేసి 106 పరుగులు చేశాడు.. దీంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. శ్రీలంక ముందు 429 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది.