Dean Elgar recalls Virat Kohli spat at him: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015లో కోహ్లీ తనపై ఉమ్మివేసాడని, తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బ్యాట్‌తో కొడతానని బెదిరించా అని తెలిపాడు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇద్దరం కలిసి పార్టీ కూడా చేసుకున్నామని ఎల్గర్ చెప్పాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ అనంతరం ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండో టెస్ట్ అనంతరం ఎల్గర్ దగ్గరకు వెళ్లిన కోహ్లీ.. అతడిని హత్తుకుని వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఎల్గర్ 2015లో తన మొదటి భారత పర్యటనను గుర్తుచేసుకున్నాడు.
‘2015లో తొలిసారి భారత పర్యటనకు వెళ్లాను. మొహాలీ టెస్టులో నేను బ్యాటింగ్‌కు దిగాను. ఆ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం సవాలుగా నిలిచింది. బ్యాటింగ్ చేస్తున్న నాపై రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు స్లెడ్జింగ్‌కు దిగారు. వారికి నేను ధీటుగా బదులిచ్చాను. ఆ సమయంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని నాపై ఉమ్మేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేను బూతులు తిడుతూ.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఏబీ డివిలియర్స్ ఆడుతుండటంతో నేను వాడిన బూతును విరాట్ అర్థం చేసుకున్నాడు. కోహ్లీ కూడా అదే బూతు మాటను నాపై ఉపయోగించాడు. మేము భారత్ ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేనే వెనక్కి తగ్గా’ అని డీన్ ఎల్గర్ తెలిపాడు.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ షాక్!
‘రెండేళ్ల తరువాత 2017-18లో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వచ్చింది. అప్పటికి విరాట్ కోహ్లీ ఏం చేశాడో ఏబీ డివిలియర్స్ తెలుసుకున్నాడు. అతని వద్దకు వెళ్లి ‘నా సహచరుడిపై ఎందుకు ఉమ్మావు?’ అని అడిగాడు. ఆ తర్వాత విరాట్ నాకు ఫోన్ చేసి సిరీస్ తర్వాత డ్రింక్ చేద్దామా? అని అడిగాడు. కోహ్లీ ప్రతిపాదనకు నేను ఒప్పుకున్నాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం కలిసి పార్టీ చేసుకున్నాం. తెల్లవారుజామున 3 గంటల వరకు కలిసి తాగాం. అప్పుడు నాకు విరాట్ క్షమాపణలు చెప్పాడు’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ చెప్పాడు.