దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నాడు ఆ పార్టీ ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలలో నేతల మధ్య సమన్వయం కొరవడిందని.. వారి మధ్య వారికే స్పష్టత కరువైందని సోనియా అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలపై పోరాడాలో కూడా కొంతమంది నేతలకు తెలియడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. పార్టీలో నేతలు గొడవ పడటం సమంజసం కాదని సోనియా హితవు పలికారు. ఇకపై ఎవరైనా హద్దులు దాటి ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో తెలుసా..?
కాంగ్రెస్ నేతలందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే పార్టీ మెరుగైన స్థానంలో ఉంటుందని సోనియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నేతలందరూ క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ముక్తకంఠంతో తిప్పికొట్టాలని సోనియా అన్నారు. ప్రాధాన్య పరంగా పార్టీ కార్యకర్తలకు సీనియర్ నేతలు శిక్షణ ఇవ్వాలని సోనియా ఆదేశించారు. యువతకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదుపైనా ఆమె చర్చించారు. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని సోనియా పేర్కొన్నారు.
