Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy: సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ఆధారంగా సినిమా తీయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ సినిమాలో తన పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. తన సొంత సినిమా కొద్ది రోజులు కోల్డ్ స్టోరేజ్‌లో పెడుతున్నట్లు చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. సోనియా గాంధీ తన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ కోడలుగా ప్రయాణాన్ని పుస్తకం రూపంలో ఆవిష్కరించారన్నారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తానని.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రుల అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని సినిమా తీయనని.. తన నియోజక వర్గంలో సహకరించే కార్యకర్తల సాయం పొందుతా అని చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారన్నారు. మరో కుటుంబానికి ఇలాంటి చరిత్ర లేదన్నారు.

దేశంలో చాలా మంది ప్రధానులు అయ్యారు.. కానీ వారికి అలాంటి త్యాగాలు లేవని తెలిపారు. రాజీవ్ గాంధీ చనిపోయాక… సోనియా గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా బాధ్యత కలిగిన ఆలోచన కాబట్టి వద్దనుకుని.. పీవీ నరసింహారావుకు ప్రధాని పదవి ఇచ్చారని స్పష్టం చేశారు. కుర్చీలో నుంచి గుంజి ఎప్పుడూ ఎక్కాలా అని తీసుకునే కాలం ఇదని.. కానీ మూడు సార్లు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. సోనియా గాంధీ నో చెప్పారన్నారు. భర్త.. తల్లి చనిపోతే బాధ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసని.. తనకు ప్రాక్టికల్ అనుభవం ఉందన్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోతే.. తన తల్లి కూడా ఎంత కష్టపడిందని చెప్పుకొచ్చారు. ప్రతి మహిళలో అమ్మను చూడాలని చెప్పే ఆర్ఎస్ఎస్ అలాంటి పాత్ర పోషించిన సోనియా గాంధీపై మాత్రం విమర్శలు చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. మూడు సార్లు ప్రధాని పదవి వదిలేసిన సోనియా గాంధీకి ఇప్పుడు పుస్తకం రాసి.. రాజకీయాల్లో లబ్ది పొందే ఆలోచన ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవే.. వాళ్ళ ఇంట్లో పుట్టిందని.. మోడీ ఇంట్లో పుట్టలేదన్నారు. డిసెంబర్ 9 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని.. వచ్చే బర్త్‌డేకి సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.