Abhijeet Dipke: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష సరికొత్త మలుపు తిరిగాయి. వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక ఉపవాస దీక్ష మంగళవారానికి 10వ రోజుకు చేరుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తింటున్న ఆహారానికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. దీక్షా స్థలిలో సోనమ్ వాంగ్‌చుక్ పక్కనే కూర్చుని అభిజీత్ దిప్కే బ్రెడ్ పకోడాలు, నూడుల్స్, కచోరీలు తింటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఒకవైపు వాంగ్‌చుక్ ప్రాణాలను పణంగా పెట్టి ఉపవాసం ఉంటుంటే, సిజెపి వ్యవస్థాపకుడు మాత్రం పక్కనే తింటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు మీమ్స్, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలపై అభిజీత్ దిప్కే ‘ఢిల్లీ తక్’ ఇంటర్వ్యూలో స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
దృష్టి మళ్లించేందుకే ఈ చైల్డిష్ ప్రయత్నాలు!
వైరల్ అవుతున్న వీడియోలపై దిప్కే తీవ్రంగా స్పందించారు. నిరసనల ద్వారా తాము లేవనెత్తుతున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఒక చిన్నపిల్లల చేష్ట లాంటి ప్రయత్నమని కొట్టిపారేశారు. “ఆ వీడియోలు సందర్భోచితంగా తీసినవి కావు. సోనమ్ సార్ జంతర్ మంతర్ వద్దకు రాకముందు నాటి దృశ్యాలవి. అప్పట్లో ఆయన యూరప్‌లో క్లైమేట్ సమ్మిట్‌లో ఉండటం వల్ల నిరసనల్లో ఆలస్యంగా చేరారు. ఆయన దీక్ష ప్రారంభించడానికంటే ముందే రికార్డ్ అయిన వీడియోను ఇప్పుడు క్లిప్ చేసి తప్పుడు ప్రచారానికి వాడుతున్నారు” అని దిప్కే స్పష్టం చేశారు. తానే ఎందుకు ఉపవాసం ఉండటం లేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు మైగ్రెయిన్ సమస్య ఉందని, అందుకే ఉపవాసం ఉండటం కష్టమని దిప్కే గతంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా, సుదీర్ఘకాలం ఉపవాస దీక్షలు చేసిన అనుభవం సోనమ్ వాంగ్‌చుక్‌కు ఉందని తెలిపారు.
కోర్ టీమ్ ఎందుకు దీక్ష చేయడం లేదు?
నిరసనలు సజావుగా సాగాలంటే నిర్వాహకులు యాక్టివ్‌గా ఉండాలని, అందుకే కోర్ టీమ్ ఉపవాసానికి దూరంగా ఉండాలని సోనమ్ వాంగ్‌చుక్ స్వయంగా నిర్ణయించారని దిప్కే వెల్లడించారు. “ఇక్కడికి వస్తున్న వేలాది మంది ప్రజలను నిర్వహించడం, పోలీసులతో వచ్చే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం వంటి పనుల కోసం కోర్ టీమ్ అందుబాటులో ఉండాలి. మేమంతా నిరాహార దీక్షకు కూర్చుంటే నిరసనను ఎవరు నడిపిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ఇక, 10 రోజులుగా సాగుతున్న దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని దిప్కే ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసిన నీట్-యుజి (NEET-UG 2026) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని మోడీ ఎప్పుడు బర్తరఫ్ చేస్తారని ప్రశ్నించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తాను స్వయంగా కోరినట్లు దిప్కే చెప్పారు. “నేను సోనమ్ సార్‌తో మాట్లాడాను. ఆరోగ్యం పాడవుతున్నందున దీక్ష ఆపాలని, ఉపవాసం లేకుండానే నిరసనలు కొనసాగిద్దామని కోరాను. కానీ ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు” అని పేర్కొన్నారు.

