Site icon NTV Telugu

No Mercy : మంట కలిసిన మానవత్వం.. ఆస్తి పంచలేదని తండ్రికి కొరివి పెట్టని కొడుకు..!

Manikyarao

Manikyarao

No Mercy : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, పిల్లల పెళ్లిళ్లు చేశాడు. భార్యను కోల్పోయిన అనంతరం, మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని కోరుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదును ఇచ్చాడు. అయితే, మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని మాత్రం తన ఇద్దరు కుమార్తెల పేరుపై రిజిస్టర్ చేశాడు.

అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్థరాత్రి మాణిక్యరావు తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్న తమ అన్నయ్య గిరీష్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అతడు తండ్రి అంత్యక్రియలకు రావడానికి నిరాకరించాడు. కారణం.. ఆ ఇల్లు తనకు ఇవ్వలేదన్న కోపం. “ఇంటిని నాకు ఇవ్వలేదు కదా, అంత్యక్రియలకు రాను” అంటూ తేల్చి చెప్పాడట.

కుమార్తెలు తండ్రికి తలకొరివి పెట్టేందుకు తనయులుగా ముందుకు వచ్చారు. వారు అన్నయ్యను మనసు మార్చుకునేలా ప్రయత్నించినా, అతడు మొండిగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు బృందంగా వచ్చి, “మీరు నిర్వహించకపోతే, మేమే మాణిక్యరావు కి అంత్యక్రియలు నిర్వహిస్తాం” అని స్పష్టం చేశారు. బంధువులు, మిత్రులు కలిసి తండ్రి పట్ల నిజమైన గౌరవం చాటుతూ తుదిచర్యలు చేపట్టారు.

చిన్న కూతురు రాజనందిని తండ్రి అంతిమయాత్రకు ముందుగా నడిచింది. తండ్రి చివరి ప్రయాణంలో కొడుకు లేకపోయినప్పటికీ, కన్న కుమార్తెల ప్రేమ అండగా నిలిచింది. ఇటు గ్రామస్థులు, బంధువులు మాత్రం తండ్రి కంటే ఆస్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన గిరీష్‌ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. “తండ్రికి కడసారి చూపు చూపేందుకు కూడా హాజరుకాకపోవడం మానవత్వం పట్ల చీకటి మచ్చ” అంటూ ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao : కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసానికి న్యాయవ్యవస్థ గట్టి బుద్ధి చెప్పింది

Exit mobile version