NTV Telugu Site icon

Punjab: ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు, ఖలిస్థాన్ మద్దతు దారుల ముందంజ

New Project (15)

New Project (15)

మధ్య పంజాబ్ లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ రెండు సీట్ల పోకడలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి. ఖలిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న అభ్యర్థులు.. ఫరీద్‌కోట్, ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. ఫరీద్‌కోట్‌ నుంచి సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా ముందంజలో ఉన్నారు. అతడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడు గార్డ్ బియాంత్ సింగ్ కుమారుడు. మరొకరు ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన ఖలిస్థాన్ మద్దతుదారు అమృతపాల్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

READ MORE: Kangana: భారీ మెజారిటీతో దూసుకుపోతున్న కంగనా

కాగా.. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ ఏడు, ఆప్‌ మూడు, శిరోమణి అకాలీదళ్‌ ఒకటి, ఇండిపెండెంట్‌ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఫరీద్‌కోట్ స్థానంలో బరిలో నిలిచిన సరబ్‌జిత్ సింగ్ ఇప్పుడు 58,323 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటి వరకు 2,05,024 ఓట్లు వచ్చాయి. కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కరమ్‌జిత్ సింగ్ అన్మోల్‌కు 1,46,701 ఓట్లు వచ్చాయి. ఫరీద్‌కోట్ లో సరబ్‌జిత్ ముగ్గురు గాయకులతో పోటీ పడ్డాడు. బీజేపీ ఇక్కడి నుంచి ఢిల్లీ ఎంపీ హన్సరాజ్ సింగ్‌ను పోటీలో దింపింది. కాంగ్రెస్‌ తరఫున మహ్మద్‌ సాదిక్‌, ఆప్‌ తరఫున కరమ్‌జిత్‌ అన్మోల్‌ బరిలో నిలిచారు. ముగ్గురూ పంజాబీ గాయకులే. సరబ్‌జిత్ గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. అతను 2004 లోక్‌సభ ఎన్నికల్లో బటిండా నుంచి పోటీ చేసినా 1.13 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీని తర్వాత 2007లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు బదౌర్ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు 15,702 ఓట్లు మాత్రమే వచ్చాయి.