Some Convicts Are More Privileged than Others Supreme Court says: గుజరాత్ గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం అప్పట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో సంవత్సరాలు న్యాయపోరాటం చేయగా నిందితులకు జీవిత ఖైదు పడింది. అయితే.. రెమిషన్ కింద పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం గతేడాది జైలు నుంచి విడుదల చేసింది. ఇలా జైలులో సత్ప్రవర్తన కింద కొంత మందిని ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు విడుదల చేస్తూ ఉంటాయి. అయితే నిందితులను ఇలా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ భాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో గురవారం విచారణ జరిగింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ప్రస్తుతం పిటిషన్‌ను విచారిస్తోంది. అయితే ఈ విషయంలో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను సుప్రీం కోర్టు ధర్మాసనం సున్నితంగా మందలించింది. బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకరైన రమేశ్ రూపాభాయ్ చందానా తరుపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
Also Read: CM KCR: 9 జిల్లాల్లో వైద్య కళాశాలలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఇందులో భాగంగా లూథ్రా వాదిస్తూ యావజ్జీవ శిక్ష పడినవారిలో పరివర్తన, పునరావాసం కోసం క్షమాభిక్ష ప్రసాదించడమనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ప్రక్రియే అన్నారు. హేయమైన నేరం దృష్ట్యా అలా చేయకూడదని బిల్కిస్‌బానో తదితరులు వాదించడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నిర్ణయం వెలువడినందువల్ల ఇప్పుడు దానిని రద్దు చేయలేమని, అలా వారు కోరడం సబబు కాదని లూథ్రా వాదించారు.
అయితే ఇంతలో బెంచ్ కలగజేసుకుని.. కొంతమంది దోషులకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటుంటాయని వ్యాఖ్యలు చేసింది. క్షమాభిక్ష విధానం గురించి తమకు తెలుసునని పేర్కొంది. అది అందరూ ఆమోదించినదే అని పేర్కొంది. ఇక్కడ బాధితురాలు, ఇతరులు ప్రస్తుత కేసుకు దీనిని వర్తింపజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసుల్లో వెలువడిన తీర్పులను న్యాయస్థానానికి సమర్పించడంలో మాత్రమే మీరు సహకరించండి అంటూ సున్నితంగా మందలించింది. ఇక లూథ్రా వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. రెమిషన్‌పై దోషుల్ని విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీం పలుమార్లు వివరణ కోరగా.. పూర్తి వివరాలతో కూడిన నివేదికను మాత్రం ఇప్పటిదాకా గుజరాత్ ప్రభుత్వం సమర్పించకపోవడం గమనార్హం.