Site icon NTV Telugu

Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్‌-లేహ్‌ రోడ్డు

Srinagar Leh Highway

Srinagar Leh Highway

Jammu & Kashmir Snowfall : జమ్మూలో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అక్కడ కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తోంది. తాజాగా శ్రీనగర్‌-లేహ్‌ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో ఆ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్‌ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. బీకన్‌ ఆఫ్‌ బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజేషన్‌ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఈ స్నో క్లియరెన్స్‌ పనుల్లో పురోగతి కనిపిస్తున్నది.

Read Also: Bomb Cyclone : అమెరికాలో భారీగా మంచు.. బయటపెట్టిన వస్తువులు మాయం

ఇది ఇలా ఉంటే..హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్తంగ్‌లో హిమపాతం వల్ల 400కుపైగా వాహనాల్లోని పర్యాటకులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో వారిని రక్షించారు. పర్యాటక ప్రాంతాలైన కులు, మనాలి, లాహౌల్, స్పితిలకు వారం రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి భారీగా హిమపాతం కురిసింది. దీంతో పోలీసులు సాయంత్రం 4 గంటలకు సిస్సు వద్ద సొరంగం ఉత్తర వైపున100 వాహనాలను నిలిపివేశారు. మరోవైపు టన్నెల్‌ దక్షిణ వైపు మూడు టూరిస్ట్ బస్సులు, 25 టెంపోలతో సహా సుమారు 300 వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో భయాందోళన చెందిన వారంతా ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా తమను రక్షించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు స్పందించారు. లాహౌల్‌, కులు, స్పితి నుంచి 60 వాహనాల్లో రెస్క్యూ సిబ్బందిని పంపారు. స్థానిక టాక్సీ ఆపరేటర్లు, ఇతరుల సహాయంతో వందలాది వాహనాల్లో చిక్కుకున్న పర్యాటకులను కాపాడారు.

Exit mobile version