Site icon NTV Telugu

Smriti Mandhana: తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

Smriti Mandhana

Smriti Mandhana

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసింది. దాంతో మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్‌ ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు మరే ఇతర మహిళా క్రీడాకారిణి ఈ ఘనత సాధించలేదు.

గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ 1997లో మహిళల వన్డేల్లో 80.83 సగటుతో 970 పరుగులు చేసింది. బెలిండా రికార్డును స్మృతి మంధాన బద్దలు కొట్టింది. స్మృతి మరో మైలురాయిని కూడా అందుకుంది. వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన అయిదో బ్యాటర్‌గా స్మృతి నిలిచింది. భారత్‌ తరఫున మిథాలీ రాజ్‌ (7805 పరుగులు) మాత్రమే ఈ మైలురాయిని దాటింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు సాధించిన పిన్న వయస్కురాలు కూడా స్మృతినే. స్మృతి 112 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల రన్స్ చేసింది. వెస్టిండీస్‌ ప్లేయర్ స్టెఫానీ టేలర్‌ (129) రికార్డును బ్రేక్ చేసింది.

వన్డే ప్రపంచకప్‌ 2025లో స్మృతి మంధాన తన స్థాయిలో ఆడలేదు. శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాపై వరుసగా 8, 23, 23 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై మాత్రం ఆకట్టుకుంది. 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు 80 రన్స్ చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. స్మృతితో పాటు ప్రతీక రావల్‌ (75; 96 బంతుల్లో 10×4, 1×6) ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ (5/40) ఆకట్టుకుంది. ఛేదనలో ఆసీస్‌ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6), ఎలీస్‌ పెర్రీ (47 నాటౌట్‌; 52 బంతుల్లో 5×4, 1×6), ఆష్లీ గార్డ్‌నర్‌ (45; 46 బంతుల్లో 3×4, 1×6), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (40; 39 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమి.

Exit mobile version