దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగాయి. పండగ సమయంలో ఫోన్‌లను కొనుగోలు చేయని వారు ఇప్పుడు కొనాలనుకుంటే మాత్రం మరింత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఇప్పటికే కొన్ని మోడళ్ల ధరలు రూ.500 నుండి రూ.2,000 వరకు పెరిగాయి. అంతేకాదు రాబోయే ప్రీమియం ఫోన్‌ల ధరలు ఏకంగా రూ.6,000 కంటే ఎక్కువ పెరగవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం… స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే మెమరీ, చిప్‌ల ధరలు నిరంతరం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. సరఫరా చైన్, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడడం ఫోన్ ధరలు పెరగడానికి ఇతర కారణాలు. రిటైల్ ఛానల్ సమాచారం ప్రకారం… చైనీస్ బ్రాండ్లు ఒప్పో, వివో, శామ్‌సంగ్, షియోమీ తమ ప్రసిద్ధ మోడళ్ల ధరలను ముందుగా పెంచాయి. ఒప్పో F31 (8GB/128GB మరియు 8GB/256GB) మోడళ్ల ధరను రూ.1,000 పెంచింది. అలానే రెనో14, రెనో14 ప్రో ధర రూ.2,000 పెరిగింది.
వివో తన T4 లైట్, T4x మోడళ్ల ధరను రూ.500 పెంచింది. శామ్‌సంగ్ తన గెలాక్సీ A17 ధరను రూ.500 పెంచింది. అంతేకాదు ఇన్-బాక్స్ ఛార్జర్‌ను తొలగించింది. అంటే గెలాక్సీ A17పై మొత్తంగా రూ .1,500 ప్రభావం పడింది. OnePlus, Realme, Motorola వంటి ఇతర బ్రాండ్లు కూడా త్వరలో ధరలను పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చిప్స్, మెమరీ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని.. ఈ పెరుగుదల 2026 చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని ఒప్పో తన రిటైల్ భాగస్వాములకు తెలియజేసింది. షియోమీ కంపెనీ తమ 14C, A5 లపై డిస్కౌంట్లను నిలిపివేసింది. Oppo Find X9 సిరీస్, Xiaomi 17 సిరీస్, Vivo X300 సిరీస్ వంటి రాబోయే ప్రీమియం ఫోన్‌ల ధరలు మునుపటి కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పెరుగుతున్న కాంపోనెంట్ ధరలు బ్రాండ్లు ప్రీమియం సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావం 2026లో ప్రీమియం మోడళ్లపై ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మాస్-మార్కెట్ మోడళ్లపై ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగా ఉంటుంది. IDC ఇండియా ప్రకారం.. బ్రాండ్లు పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్‌ల ద్వారా స్టాక్‌ను మోహరించాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో షిప్‌మెంట్‌లు బలంగా ఉన్నాయి. అయితే కస్టమర్ డిమాండ్ ఊహించినంత పెరగలేదు. మిడ్-రేంజ్ విభాగాలలో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. అయితే ప్రీమియం మోడళ్లకు డిమాండ్ బలంగా ఉంది. దీని వలన బ్రాండ్లు ధరలను పెంచాల్సి వచ్చింది. 2025 నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు తగ్గవచ్చని, దీనివల్ల పూర్తి సంవత్సరం అమ్మకాలు 150 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగా ఉండవచ్చని IDC అంచనా వేసింది.