NTV Telugu Site icon

Singareni CMD Balaram : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులకు శ్రీకారం

Balaram

Balaram

ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే 4 కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరి కొన్ని నూతన బొగ్గు బ్లాకుల సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సింగరేణిలో కొత్త గనులపైనిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పలు అంశాలపై లోతుగా చర్చించారు. నూతన గనులపై తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాల్సిన నాలుగు కొత్తగనుల ప్రణాళికలు, పనుల పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఒడిషా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాకు ప్రస్తుత పరిస్థితి పై చర్చించిన ఆయన, చివరి దశ అనుమతులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వసహకారం కావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొని ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు ఈనెల మూడో వారం భువనేశ్వర్ వెళ్తున్నారని.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనితో ఈ బ్లాకు సంబంధించిన చివరి అనుమతులు పూర్తయి అతి త్వరలోనే ఇక్కడ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావం ప్రకటించారు.

నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, అయితే తొలి ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గును సమీపంలోని రైల్వేసైడింగ్ కు తరలించడానికి కాంట్రాక్ట్ కూడా అప్పగించడం జరిగిందన్నారు. అలాగే కొత్తగూడెం ఏరియాలో ప్రారంభించాల్సి ఉన్న వీకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి మిగిలిన అనుమతులు పూర్తిచేసుకుని ఈ ఏడాది కనీసం 30 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధం కావాలని ఆయన సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ గని నుండి ఏడాదికి 43 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. అలాగే ఇల్లెందు ఏరియా లో ఏడాదికి 20 లక్షల టన్నులబొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభించనున్న రోంపెడు ఓపెన్ కాస్ట్ గని నుండి ఈ ఏడాది కనీసం 10 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

బెల్లంపల్లి ఏరియా లో ప్రారంభించాల్సి ఉన్న గోలేటి ఓపెన్ కాస్ట్ గని అనుమతులు, తదితర అంశాల పైన సంబంధిత అధికారులతో చర్చించారు . ఏడాదికి 35 లక్షల టన్నులబొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా గల ఈ గని నుండి ఈ ఏడాది కనీసం 4 లక్షల టన్నులబొగ్గును ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. అనుమతుల విషయంలో కాలయాపన జరిగితే రేట్లు పెరిగి ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది కనుక ఏరియాల జీఎంలు స్థానిక జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారుల తో సంప్రదిస్తూ అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్ గని, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గనుల గురించి కూడా ఛైర్మన్ చర్చించారు. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా మరికొన్ని బొగ్గు బ్లాక్ లను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించనున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటీవల సింగరేణి పై నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కొత్త గనుల ప్రారంభానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు.