Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!

Manmadha Re Release

Manmadha Re Release

Manmadha Re-Release: రీ-రిలీజ్ ట్రెండ్‌లో మరో కల్ట్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తమిళ స్టార్ హీరో శింబు, నటి జ్యోతిక జంటగా నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ ను అందుకుంది. ఆ తర్వాత ‘మన్మధ’ పేరుతో తెలుగులో విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా శింబు నటన, కథలోని ఉత్కంఠభరితమైన మలుపులు, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ అవుతున్న పలు క్లాసిక్, డబ్బింగ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాత సినిమాలను కొత్త అనుభూతితో పెద్ద తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మన్మధ’ రీ-రిలీజ్ కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ప్లేను శింబు స్వయంగా అందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. శింబు, జ్యోతికల కెమిస్ట్రీతో పాటు థ్రిల్లింగ్ కథనం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.