NTV Telugu Site icon

Silk Smitha Birth Anniversary: సిల్క్ స్మిత.. ఓ అయస్కాంతం

Silk Smitha

Silk Smitha

Silk Smitha Birth Anniversary: జ్యోతిలక్ష్మిలాగా గొప్ప నర్తకి కాదు, జయమాలినిలాగా అందం, చందం ఉన్నదీ లేదు. అయినా సిల్క్ స్మిత ప్రవేశంతో ఆ ఇద్దరికీ కొన్ని అవకాశాలు తగ్గాయి అనడం అతిశయోక్తి కాదు. మరి సిల్క్ స్మితలో ఏముంది? మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే ఆకర్షణ ఉంది. అందుకే సిల్క్ ను కొందరు అయస్కాంతం అన్నారు.

సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలిలో విజయలక్ష్మి జన్మించారు. నాల్గవ తరగతి దాకా చదువుకున్న విజయలక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్ళకే పెళ్ళి చేసేశారు. ఆమె భర్త, అత్తమామలు వేధిస్తూ ఉండడంతో ఇల్లు వదలి పారిపోయారు. మదరాసు చేరి, తొలుత టచప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు స్మిత. కొంతమంది హీరయిన్లకు టచప్ చేస్తున్న సమయంలోనే బిట్ రోల్స్ లో నటించే అవకాశం దక్కింది. మళయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్ మన్ దర్శకత్వం వహించిన ‘ఇనయె తేడీ’ చిత్రంలో స్మితకు తొలిసారి నాయిక పాత్ర లభించింది. ఈ సినిమాకు ముందు తమిళంలో ‘వండిచక్రం’ అనే చిత్రంలో స్మిత కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాలలో తమిళ, మళయాళ చిత్రసీమల్లో స్మితకు మంచి గుర్తింపు లభించింది. ‘వండి చక్రం’ తెలుగులో ‘ఘరానా గంగులు’గా రీమేక్ కాగా, అందులో స్మిత నటించి, తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మాతృభాష తెలుగులో స్మితకు వచ్చీ రాగానే మంచి అవకాశాలు లభించాయి. ‘సీతాకోకచిలుక’లో శరత్ బాబు భార్యగా నటించారు. ‘రోషగాడు’లో సిఐడీ పాత్రలో కనిపించారు. యన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…” సాంగ్ లో నర్తించారు స్మిత. ఆ తరువాత నుంచీ ఐటమ్ గాళ్ గా ఆమె సాగిపోయారు. అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత డాన్సులు భలేగా కనువిందు చేశాయి.

FIFA Fan Event: ఫిఫా ఈవెంట్‌లో రెపరెపలాడిన భారత జెండా.. నోరా డ్యాన్స్‌కు ఫిదా.. వీడియో వైరల్‌

ఐటమ్ గాళ్ గా సాగుతున్నా, సిల్క్ స్మిత తనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె ప్రధాన నాయికగా ‘మాయలేడి’ అనే చిత్రం రూపొంది జనాన్ని ఆకట్టుకుంది. ఇక ‘బావ-బావమరిది’లో వ్యాంప్ గా సిల్క్ అభినయం భలేగా అలరించింది. ‘లేడీ జేమ్స్ బాండ్’లోనూ, చిరంజీవి ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ చిత్రాలలోనూ కీలక పాత్రల్లో కనిపించారు సిల్క్ స్మిత. తన దరికి చేరిన ఐటమ్ సాంగ్స్ లోనూ, తగిన పాత్రల్లోనూ స్మిత ఆకట్టుకున్నారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత తనదైన బాణీ పలికించారు. సిల్క్ ఐటమ్ సాంగ్ ఆ రోజుల్లో ఓ పేయింగ్ ఎలిమెంట్ గా ఉండేది.

మత్తు కళ్ళతో చూపరులను చిత్తు చేసిన సిల్క్ స్మిత నిజజీవితంలో పసిపిల్ల మనస్తత్వం కలిగి ఉండేవారు. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె నర్తించిన, నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆ బాధను మరచిపోగలిగారు. సిల్క్ స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు సినిమాకు పనికి వస్తాయని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ భావించారు. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’ నిర్మించారు. సిల్క్ జయంతి సందర్భంగా 2011 డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సిల్క్ పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించారు. సిల్క్ స్మిత నేడు లేరు. ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఈ నాటికీ కళ్ళింతలు చేసుకొని చూస్తూనే ఉన్నారు. అదీ… సిల్క్ మత్తు కళ్ళలోని గమ్మత్తు. అదే ఓ అయస్కాంతం అనీ చెప్పవచ్చు