NTV Telugu Site icon

Siddu: టిల్లుకి, నాకు ఒక్కటే తేడా.. టిల్లు పాత్ర ఎలా పుట్టిందంటే? పార్ట్-3 కూడా : సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ

Siddu Jonnalagadda Interview

Siddu Jonnalagadda Interview

Siddu Jonnalagadda Interview for Tillu Square Movie: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోగా ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేసిన ఈ ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాలు లేవు, హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండడం సహజమే, ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ ని అందించడానికి కృషి చేశాం.

పాత్రకి కొనసాగింపా? లేక కథకి కొనసాగింపా?
రెండింటికి కొనసాగింపుగా ఉంటుంది, పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో, కథ కొనసాగింపు కొంత ఉంటుంది. టిల్లు ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను, థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి, టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు.

హీరోయిన్ డామినేషన్?
హీరోయిన్ డామినేషన్ ఏముండదు. కథలో ఏ పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది, డీజే టిల్లులో హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది.

సీక్వెల్ కి దర్శకుడు ఎందుకు మారాడు? సినిమా నిడివి ఎందుకు తగ్గించారు?
సినిమా నిడివి కావాలని తగ్గించలేదు, సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్న క్రమంలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి మల్లిక్ ను దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.

పార్ట్-3 కూడా ఉంటుందా?
సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది, అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నా, చూడాలి ఏమవుతుందో.

డీజే టిల్లు పాత్ర ఎలా పుట్టిందంటే?
టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు, నేను మనసులో అనుకుంటాను అంతే తేడా అని అంటూ ముగించారు.