Kondapochamma Sagar : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్‌లోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.. అయితే… మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే.. తాజాగా గల్లంతైన ఐదుగురు యువకులలో ఒకరి మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. మిగితా నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.
స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్‌కి చెందిన ఓ రబ్బర్ బోట్ తో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల తోనూ గాలింపు చర్యలు చేపట్టారు. JCB లతో తీసిన లోతైన గుంతల్లో పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. శామీర్ పేట్ లోని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కి సమాచారం అందించడంతో.. కొద్దిసేపటి క్రితం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ బయల్దేరినట్లు తెలుస్తోంది. హైదారాబాద్ నుంచి కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రమాద స్థలానికి మృతుల పేరెంట్స్, బంధువులు చేరుకున్నారు. చీకటి పడే లోపు మృతదేహాలు వెలికి తీసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది.
అయితే.. ఈ దారుణ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రిజర్వాయర్ వద్ద పటిష్ట భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ వద్ద ఎవరూ ఈతకు వెళ్లకుండా కఠిన నియమాలు అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
ఈ ఘటన దృష్ట్యా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రిజర్వాయర్ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశించారు. రిజర్వాయర్ వద్ద కఠిన నిబంధనలను అమలు చేయడంతో పాటు, సందర్శకుల తీరుపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని సూచించారు. రిజర్వాయర్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండేందుకు పోలీసు సిబ్బందిని మోహరించాలని, ప్రమాదం ఎదురైనప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కోరారు.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీటిలో మునిగిన యువకుల మృతదేహాలను వెలికితీసేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ ఘటన ప్రజల హృదయాలను కలచివేసింది. ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.
Congress : ఈనెల 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ.