Siddipet: చల్లని బీరు తాగి రిలాక్స్ అవుదామని వెళ్లిన ఓ మందుబాబుకు ఊహించని షాక్ ఎదురైంది. బాటిల్ మూత తీసి గ్లాస్‌లో పోయబోతుండగా.. అందులో కనిపించిన వస్తువు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బీరు బాటిల్‌లో ఖాళీ కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో సిద్దిపేట జిల్లాలోని వైన్ షాప్ వద్ద కలకలం రేగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి ప్రాంతంలోని ఓ వైన్ షాప్‌లో చోటుచేసుకుంది.
స్థానికంగా నివసించే ఓ వ్యక్తి వైన్స్‌కి వెళ్లి కింగ్ ఫిషర్ లైట్ బీరు కొనుగోలు చేశాడు. అయితే అతను తీసుకున్న బాటిల్ పరిశీలించగా, అందులో ఖాళీ కండోమ్ ప్యాకెట్ తేలియాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన వినియోగదారుడు వెంటనే తిరిగి వైన్ షాప్‌కి వెళ్లి అక్కడి సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వకపోవడం, సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బీరు బాటిల్‌లో ఆ ప్యాకెట్ ఎలా వచ్చింది..? ఇది తయారీ లోపమా..? లేక ఎవరో కావాలనే చేశారా..? అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వినియోగదారుల భద్రత, మద్యం నాణ్యతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫుడ్ అండ్ బేవరేజ్ ఉత్పత్తుల విషయంలో మరింత కట్టుదిట్టమైన తనిఖీలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
