NTV Telugu Site icon

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈ నెల 20న ప్రమాణస్వీకారం

Karnataka

Karnataka

Karnataka CM: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నాలుగు రోజులుగా సాగిన రాజకీయ డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల తర్వాత బుధవారం అర్ధరాత్రి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మే 20 న మధ్యాహ్నం 12.30 గంటలకు వీరిద్దరు బెంగళూరులో వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్‌ పార్టీ(సీఎల్పీ) సమావేశం జరగనుంది. బెంగళూరులోని ఇందిరా గాంధీ భవన్‌లో సీఎల్పీని ఇవాళ ఏర్పాటు చేస్తున్నట్టు డీకే శివకుమార్ అర్థరాత్రి ప్రకటన విడుదల చేశారు. సీఎల్పీ సమావేశానికి బెంగళూరు చేరుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కేంద్ర పరిశీలకులను కోరారు. సీఎం పేరు ప్రకటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో ఇవాళ కర్ణాటక సీఎంను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈరోజు లేదా రేపు తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని, 72 గంటల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా బుధవారం తెలిపారు.

ఇవాళ ఉదయం 9 గంటలకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఇంట్లో బ్రేక్‌ ఫాస్ట్ మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఢిల్లీలో తొలిసారి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను ముఖాముఖికి పిలిచింది. ఢిల్లీలో నాలుగు రోజులుగా ఉన్నా కూడా ఆ ఇరువురు ఒక్కసారి కూడా కలవలేదు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఇద్దరు కలిసే ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Read Also: Gujarat: దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌పైనే అత్యాచారం.. పైశాచిక ప్రవర్తన

బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన అభ్యర్థుల సుదీర్ఘ భేటీ కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం కోసం డీకే శివకుమార్‌ను కూడా సమావేశంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య ఉమ్మడి ఒప్పందం కుదిరిందని అంతకుముందు రోజు వార్తలు వచ్చాయి. బెంగళూరులో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ సాయంత్రం నాటికి పార్టీ దీనిని ఖండించింది. సీఎం పేరును నిర్ణయించడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుందని చెప్పబడింది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిపై ఏకాభిప్రాయం కుదిరిందని అర్థరాత్రి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.