Siddaramaiah Resignation: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను అధికారికంగా గవర్నర్ కార్యాలయానికి సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో లేనందున.. సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ సెక్రటరీ) పంకజ్ కుమార్ మెహతాకు అందజేశారు. అంతకుముందు గురువారం ఉదయం డి.కె. శివకుమార్‌తో పాటు తన కేబినెట్ సహచరులతో జరిగిన ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ లో సిద్ధరామయ్య తన తదుపరి కార్యాచరణను వివరించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్నట్లు మంత్రులకు స్పష్టం చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోయినప్పటికీ.. రాజీనామా ప్రక్రియ మాత్రం అనుకున్న సమయానికే ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ చివరి అధికారిక సమావేశంలో సిద్ధరామయ్య కాస్త భావోద్వేగంగా మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తన ప్రభుత్వం సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణతో పాటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘గ్యారెంటీ స్కీమ్స్’ ను ఆర్థిక ఒత్తిడుల నడుమ విజయవంతంగా ఎలా అమలు చేశామనే విషయాలను మంత్రివర్గానికి వివరించారు.
ఇక, సిద్దరామయ్య ఒక లా గ్రాడ్యుయేట్. నంజుండ స్వామి అనే లాయర్ ప్రోత్సాహంతో తొలిసారిగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ లోక్ దళ్ తరఫున పోటీ చేశారు. అనూహ్యంగా గెలిచి మైసూర్ తాలూకా నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తదుపరిగా రాష్ట్రంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో చేరిపోయారు. 1985లో ఆయనకు రాష్ట్ర మంత్రి పదవిని ఇచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య ఓడిపోయారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక, జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయ్యారు. ఇదే ప్రభుత్వంలో 1996లో తొలిసారి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే 1999లో ఈ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. అప్పటివరకు జనతాదళ్‌లో సిద్దరామయ్య కొనసాగారు. జనతాదళ్‌లో చీలిక ఏర్పడిన తర్వాత, దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)లో చేరారు. కానీ 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో మళ్లీ గెలిచి, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సర్కారులో సిద్దరామయ్య డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే 2005లో దేవెగౌడతో సిద్దరామయ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో జేడీఎస్ నుంచి ఆయన్ను బహిష్కరించారు. తదుపరిగా ఆయన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సిద్దరామయ్య తొలిసారిగా 2013 మే 13న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతేకాదు.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర సీఎంగా సేవలు అందించిన నేతగా చరిత్ర సృష్టించారు. అది కూడా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల రోజున (జనవరి 1న) ఈ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ పేరిట ఉండేది. 2026 జనవరి 2 నాటికి సీఎం హోదాలో 2,791 రోజుల పదవీ కాలాన్ని సిద్దరామయ్య పూర్తి చేసుకున్నారని పేర్కొంటూ గతంలో కర్ణాటక ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ 2,789 రోజులు అంటే ఏడు సంవత్సరాల 6 నెలల పాటు సీఎంగా సేవలు అందించారు. అప్పట్లో సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీకగా ఆయన పేరుగాంచారు. సిద్దరామయ్య 2013 నుంచి 2018 వరకు సీఎంగా కొనసాగారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మళ్లీ 2023 మేలో సిద్దరామయ్య సీఎం అయ్యారు.
