Shubman Gill: ఆ ఒక్క మాటతో మరో మెట్టు ఎక్కేసిన కెప్టెన్ గిల్.. ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ..?
బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గెలిచి, ఈ మైదానంలో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో ఓటమికి ఈ గెలుపుతో దిమ్మతిరిగే బదులు ఇచ్చింది. ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
Read Also:ENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ ఘన విజయం.. 58 ఏళ్ల తర్వాత..
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లలో అసాధారణంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగుల డబుల్ సెంచరీతో అలరించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి మ్యాచ్ మొత్తానికి 430 పరుగులతో ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో రెండో ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇక టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్ అదిరిపోయే డబుల్ సెంచరీ చేయగా, జైస్వాల్ (87), జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించడంతో భారత్ 587 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలుత 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ హ్యారీ బ్రూక్ (158) మరియు జేమీ స్మిత్ (184) పోరాటంతో 407 పరుగులు సాధించగలిగింది. ఇక ఆ ఇన్నింగ్స్ లో 6 మంది బ్యాటర్స్ 0 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్ మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీసి తన ప్రతిభను చూపించాడు. ఇక భారీ ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్, మరోసారి భారీ స్కోరు చేసింది. గిల్ 161 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, పంత్ (65), జడేజా (69), రాహుల్ (55) ముఖ్యమైన భాగస్వామ్యాలు అందించారు. దీనితో కలిపి ఇంగ్లాండ్‌కు 600కి పైగా టార్గెట్ నిర్ధేశించింది టీమిండియా.
Read Also:Abdullapurmet: రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ఢీకొట్టిన లారీ.. స్టాట్‌లో ఇద్దరూ మృతి..
ఇంగ్లాండ్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగినప్పుడు, ఆకాశ్ దీప్ బంతులతో చుక్కలు చూపించాడు. అతను 6 వికెట్లు పడగొట్టగా, మిగతా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. జేమీ స్మిత్ (88) మినహా మిగిలిన ఆటగాళ్లు తేలిపోయారు. చివరకు ఇంగ్లాండ్ 68.1 ఓవర్లలో 271 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ గెలుపుతో కెప్టెన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది ఇలా ఉండగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ గిల్.. సిరాజ్, ఆకాశ్ దీప్ లు అద్భుత బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు. అయితే, వికెట్లు తీసే అవకాశాలు రాకపోయినా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఆ ఒక్కమాటతో ఇప్పుడు అందరూ గిల్ కెప్టెన్సీ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఒక నిరాశలో ఉన్న బౌలర్‌కు కెప్టెన్ నుంచి వచ్చిన మద్దతు అతనికి మానసికంగా బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇదే గిల్ లీడర్‌గా తన ప్రత్యేకతను చాటాడు. ఈ విజయంతో టీమిండియా తమ బౌలింగ్ దళం బుమ్రా లేకపోయినా పటిష్టంగా ఉందని నిరూపించింది. సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో భారత్‌కు కీలక విజయాన్ని అందించారు. గిల్ నాయకత్వం, జట్టులోని సమష్టి కృషి ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పటి వరకు విజయాన్ని నమోదు చేయలేని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఈ గెలుపు టీమిండియాకు కొత్త నమ్మకాన్ని అందించింది.
