NTV Telugu Site icon

BCCI Contracts: శ్రేయస్‌ అయ్యర్‌కు కాంట్రాక్టు పక్కా.. తెలుగు ఆటగాడికి అవకాశం!

Bcci

Bcci

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించిన జాబితా త్వరలో విడుదల కావాల్సి ఉంది. గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి పక్కాగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. సెలక్షన్‌ కమిటీ, ప్రధాన కోచ్‌తో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా కాంట్రాక్టు తుది జాబితాను అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఆమోదం కోసం పెట్టనున్నాడు.

టీ20 ప్రపంచ కప్‌ 2024 అనంతరం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. దాంతో ఈ ముగ్గురికి A+ కేటగిరిలో స్థానం దక్కకపోవచ్చి. ఎందుకంటే A+ కేటగిరిలో కొనసాగాలంటే ఆటగాడు టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాలి. ఈ నేపథ్యంలో వీరికి A కేటగిరి దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ కాంట్రాక్టు జాబితా నుంచి నిష్క్రమిస్తాడు. జస్ప్రీత్‌ బుమ్రా మాత్రం A+ కేటగిరిలోనే కొనసాగనున్నాడు. అక్షర్‌ పటేల్‌ కేటగిరి B నుంచి Aకు వచ్చే అవకాశం ఉంది.

యశస్వి జైశ్వాల్‌ కేటగిరి B నుంచి Aకు ప్రమోషన్‌ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకాశ్‌ దీప్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ కేటగిరి Cలో స్థానం దక్కించుకోవచ్చు. తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. కేటగిరి Cలో మనోడికి చోటు దక్కొచ్చు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కాంట్రాక్టులో కొనసాగడం అనుమానమే.