Sanjay Raut comments : శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శ్రద్ధను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలాను బహిరంగంగా ఉరితీయాలన్నారు. అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్యపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని… ఇలాంటి దుర్మార్గుడిని మరో ఆలోచన లేకుండా బహిరంగంగా ఉరితీయాలని సంజయ్ డిమాండ్ చేశారు. దీన్ని లవ్ జీహాద్ అనొచ్చు లేక మరొక పేరుతో పిలవొచ్చు… ఏదైనా మన అమ్మాయిలు చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Great Love: 70ఏళ్ల ముసలాడిని ప్రేమించిన 19ఏళ్ల యువతి.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
ఈ క్రమంలోనే అమ్మాయిలకు సంజయ్ రౌత్ కొన్ని సూచనలు చేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఎలా బతకాలో నేర్చుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచం ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటూ హితవు పలికారు. మహారాష్ట్ర బిడ్డను కిరాతకంగా హతమార్చడం బాధాకరమన్నారు. ఆ అమ్మాయి ఇంత దారుణంగా హత్యకు గురైన తర్వాత కూడా వారిని జంట అని పిలవడం సరికాదని… ఈ ప్రపంచం ఎంత ఫేక్ అనేది ఈరోజు మరోసారి అర్థమవుతోందన్నారు. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా నిజాలను చెప్పాలని కోరారు. ఆ అమ్మాయి తండ్రి ఇంటర్వ్యూని తాను చూశానని… ఆయన బాధను మనం అర్థం చేసుకోవాలని సంజయ్ రౌత్ చెప్పారు. తన కూతురుకి నచ్చ చెప్పేందుకు ఆయన ఎంతో ప్రయత్నించారన్నారు. ఈ దారుణానికి ఒడికట్టిన వ్యక్తిని విచారించాల్సిన అవసరం కూడా లేదన్నారు.