Site icon NTV Telugu

NLG MURDER ATTEMPT: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన.. జస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పాపానికి..

Nalgonda

Nalgonda

నల్లగొండ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పాపానికి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ వ్యక్తి. ఖరీదైన సెల్‌ఫోన్, డబ్బు కోసం ఓ దుండగుడు వేసిన ట్రాప్‌లో పడి అతను ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది? నల్లగొండ టు హైదరాబాద్.. జాతీయ రహదారి.. హైవేపై ఇమ్రాన్ అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు.. అదే హైవేపే.. నార్కట్‌పల్లి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇమ్రాన్ కారును.. లిఫ్ట్ కావాలంటూ సైగ చేసి ఆపాడు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతన్ని చూడగానే.. అయ్యో పాపం.. ఎంతో ఆపదలో ఉన్నాడనుకుని ఇమ్రాన్… కారు ఆపి ఎక్కించుకున్నాడు. అదే అతని పాలిట శాపమైంది.

Also Read:Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!

మానవత్వంతో కారు ఎక్కించుకున్న ఇమ్రాన్‌పై కారు ఎక్కిన వ్యక్తి తన బుద్ధి చూపించాడు. కారు చిట్యాల పరిధిలోకి చేరుకోగానే.. వెనుక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. హఠాత్తుగా తన వద్ద ఉన్న కత్తిని తీసి ఇమ్రాన్ మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇమ్రాన్ దగ్గర ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్, నగదును లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించాడు. దీన్ని ఇమ్రాన్ తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇమ్రాన్ డిఫెన్స్ చేయడంతో మరింత రెచ్చిపోయాడు దుండగుడు. అతని మెడ, చేతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమ్రాన్ కారును నిలిపివేసి కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉండి గమనించిన స్థానికులు.. అక్కడికి చేరుకునే లోపే.. నిందితుడు చీకట్లోకి పరారయ్యాడు… స్పాట్..

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి.. ఇమ్రాన్‌ను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు చిట్యాల పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిని హిందీ మాట్లాడే వ్యక్తిగా గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లేదా బీహర్‌ రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇమ్రాన్‌పై హత్యాయత్నం, దోపిడీ ప్రయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు పారిపోయిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read:Google Search యూజర్లు అలర్ట్..! సెర్చ్‌ ఇంజిన్ లో పొంచి ఉన్న ముప్పు.. సేఫ్‌గా ఉండండి ఇలా.!

జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు సూచిస్తున్నారు..

Exit mobile version