Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్‌లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్‌లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్‌ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు మీర్పేట్ పోలీసులు ఇప్పటికే రెండు సార్లు సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు.
Also Read: Fire Incident: టీఫిన్స్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
అయితే ఇప్పుడు గురుమూర్తి కూతురు చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కీలకంగా మారాయి. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని, అమ్మ ఎక్కడ ఉందని అడిగితే తండ్రి మౌనంగా ఉన్నాడని పోలీసులకు తెలిపింది. గురుమూర్తి తన భార్యను హత్య చేసిన విషయాన్ని పోలీసుల ఎదుట అంగీకరించినప్పటికీ, హత్య జరిగిన విధానం గురించి పోలీసులు అడగగా వివిధ వెర్షన్లలో సమాధానాలు చెబుతున్నాడు. గత రాత్రి పోలీసులు గురుమూర్తిని చెరువు వద్దకు తీసుకెళ్లి మరిన్ని ఆనవాళ్ల కోసం గాలించారు. అయితే, చెరువులో మాధవికి సంబంధించిన ఆనవాళ్లు ఏవి లభించలేదు.
Also Read: Grama Sabha: తెలంగాణ వ్యాప్తంగా నాల్గవరోజు కొనసాగుతున్న గ్రామ సభలు
ఈ కేసు విషయంలో క్లూస్ టీమ్ కీలక ఆధారాలను సేకరించింది. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ రోజు గురుమూర్తిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. గురుమూర్తి పొంతనలేని సమాధానాలు, అతని చేతల వెనుక ఉన్న నిజాలు బయటపడే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. ఈ హత్యకేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.