NTV Telugu Site icon

Shikhar Dhawan: నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యా: శిఖర్‌ ధావన్‌

Shikhar Dhawan Bat

Shikhar Dhawan Bat

Shikhar Dhawan was bit shocked left out of the India Squad for Asian Games 2023: సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల పాటు మూడు ఫార్మాట్‌లలో ఓపెనర్‌గా ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఫామ్‌ లేమితో గబ్బర్ భారత జట్టుకు దూరమయ్యాడు. చివరగా 2022 డిసెంబరులో భారత్ తరఫున మ్యాచ్‌ ఆడాడు. ఈ 8 నెలల కాలంలో ఒక్కసారి కూడా జట్టులోకి రాలేదు. భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

సెప్టెంబరు 23 నుంచి చైనాలోని హాంగ్‌జౌలో ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొలిసారిగా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం రోహిత్ సారథ్యంలోని టీమిండియా సీనియర్‌ జట్టు సన్నద్ధమవుతుండటంతో.. ద్వితీయ శ్రేణి జట్టు ఆసియా క్రీడలకు వెళుతోంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ముందుగా ఆసియా క్రీడలకి శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా పంపుతారని నెట్టింట ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ సెలక్టర్లు చివరి నిమిషాల్లో గైక్వాడ్‌కు పగ్గాలు ఇచ్చి.. ధావన్‌కు షాక్ ఇచ్చారు. ఆసియా క్రీడలకు ఎంపిక కాకపోవడంపై తాజాగా ధావన్ స్పందించాడు.

భారత జట్టులో తన పేరు లేకపోవడంతో కాస్త షాక్‌కు గురయ్యానని శిఖర్‌ ధావన్‌ చెప్పాడు. ‘ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో నా పేరు లేకపోవడంతో కాస్త షాక్‌కు గురయ్యా. కానీ బీసీసీఐ సెలక్టర్లు భిన్నమైన ఆలోచనా విధానంతో ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకున్నా. దానిని నేను అంగీకరించాలి. రుతురాజ్‌ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ యువకులే. వారు బాగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది’ అని గబ్బర్ తెలిపాడు.

Also Read: Gold Today Price: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు! నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

‘పునరాగమనం కోసం నేను సిద్ధంగా ఉంటా. అందుకే నన్ను నేను ఫిట్‌గా ఉంచుకుంటా. ఇప్పటికీ శిక్షణను, ఆటను ఆస్వాదిస్తున్నా బీసీసీఐ సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను. నా భవిష్యత్తు గురించి నేను ఏ సెలక్టర్‌తో మాట్లాడలేదు. నేను ఎన్‌సీఏకు వెళ్తున్నా. అక్కడ నా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. సౌకర్యాలు బాగున్నాయి. ఎన్‌సీఏ నా కెరీర్‌ని తీర్చిదిద్దింది. అందుకు నేను కృతజ్ఞుడను’ అని శిఖర్ ధావన్‌ చెప్పాడు.

Show comments