Site icon NTV Telugu

Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. షేక్ హసీనా కాలంలో జరిగిన ఉద్రిక్తతల కంటే ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.

ఇక తాజా పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. బంగ్లాదేశ్‌లో హింస సర్వసాధారణంగా మారిపోయిందని వాపోయారు. గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే దేశం వీడిచి భారత్‌కు వచ్చానన్నారు. అంతే తప్ప భయపడి రాలేదన్నారు. అయినప్పటికీ దేశంలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్‌లో హింస పెరిగిపోయిందని.. ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని ధ్వజమెత్తార. చట్టాలు సరిగ్గా అమల్లో లేవని.. దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్‌ పేరు కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు భారత్‌-బంగ్లాదేశ్ బంధాన్ని దెబ్బతీస్తున్నాయని వాపోయారు.

ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల గురించి కూడా షేక్ హసీనా స్పందించారు. ‘‘అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలు ఎన్నికలు కాదు.. పట్టాభిషేకం.’’ అని అన్నారు. యూనుస్.. బంగ్లాదేశ్ ప్రజల నుంచి ఒక్క ఓటు లేకుండా పరిపాలించారని.. కానీ తొమ్మిది సార్లు ప్రజా తీర్పు ద్వారా ఎన్నికైన పార్టీని మాత్రం నిషేధించారని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. స్వతంత్ర న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటిస్తుందని తనకు నమ్మకం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వం, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్నప్పుడు సంతోషంగా బంగ్లాదేశ్‌కు వెళ్తానని తెలిపారు.

హదీ హత్య
డిసెంబర్ 12న ఢాకాలో రిక్షాలో ఉండగా ఉస్మాన్ హదీని అతి దగ్గరగా కాల్చి చంపారు. తలకు గాయమై మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు విమానంలో తరలించారు. డిసెంబర్ 18న మరణించారు. అనంతరం బంగ్లాలో హింస చెలరేగింది. దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అతడిపై ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోనే ఉన్న మసూద్‌ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తరచూ స్థానాలను మారుస్తున్నాడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

Exit mobile version