NTV Telugu Site icon

Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ

New Project (41)

New Project (41)

తెలుగు వారు ఎక్కడికి వెళ్లిన రాణిస్తున్నారు. తమ ప్రతిభను కనబరిచి అగ్ర రాజ్యంలో సైతం గౌరవమైన పదవులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. ఈమె 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా వ్యవహరించారు. తాజాగా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దీని ద్వారా కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయ బాదిగ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. కోర్టు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఫ్యామిలీ లాలో జయ నిపుణురాలిగా పేరు సంపాదించారు. అలాగే టీచర్‌గానూ, మెంటార్‌గానూ వ్యవహరించారు. ఈమెకు బాధ్యత రావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.

READ MORE: Uber buses : ఇక నుంచి ఉబర్ బస్సులు.. ఎక్కడ ప్రారంభిస్తున్నారో తెలుసా?

కాగా.. జయ బాదిగ విజయవాడలో జన్మించారు. హైదరాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకూ ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లారు. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో ఎంఏ పూర్తిచేశారు. ఆ తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో జూరిస్ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ పూర్తి చేసుకున్నారు. 10 ఏళ్లకు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగించారు. గతంలో కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలోనూ, కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో అటార్నీగానూ పనిచేశారు. 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్‌గా వ్యవహరించారు. అయితే శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో జడ్జిగా జయ బాదిగ నియమితులయ్యారు. ఇప్పటికే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో స్థిరపడ్డారు. కీలకమైన పదవులు సైతం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జయ బాదిగ ఈ పదవి సొంత చేసుకున్నారు.