Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ప్రయోగాలు చేయడంలో ఈ కుర్రాడు ఎప్పుడు ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో ఈ కుర్ర హీరోకు విజయాలు అందలేదు అన్నమాట వాస్తవమే. అందుకే ఈసారి మంచి మంచి కథలను ఏరుకొని పెట్టుకొని.. వరుస సినిమాలను తీసుకొస్తున్నాడు. ఇక నేడు శర్వానంద్ పుట్టినరోజు. సాధారణంగా హీరోల పుట్టినరోజు అంటే.. సినిమా అప్డేట్స్ వస్తాయి అన్న విషయం తెల్సిందే. శర్వాకు అయితే ఒకటి కాదు .. ఏకంగా ఒకేరోజు మూడు సినిమాలు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. శర్వా 35.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మనమే. మొదటి నుంచి ఈ సినిమాకు బేబీ ఆన్ బోర్డు అనే టైటిల్ అనుకున్నారు కానీ, మరెందుకో టైటిల్ ను మనమే గా మార్చారు. ఈ చిత్రంలో శర్వా సరసన కృతి శెట్టి నటిస్తోంది. తండ్రీకొడుకుల మధ్య జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో నటించే చిన్నారి.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకు విక్రమ్ ఆదిత్య కావడం విశేషం.
ఇక ఈ సినిమా తరువాత శర్వా 36.. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇందులో బైక్ రేసర్ గా శర్వా నటించనున్నాడు. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా శర్వా తన 37 వ సినిమాను కూడా ప్రకటించాడు. గతేడాది సామజవరాగమనా సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఒక్కరోజునే మూడు సినిమా అప్డేట్స్ అనేసరికి అభిమానులు అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వరాదే.. ఇప్పటికే మూడు అయ్యాయి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాలతో శర్వా ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.