Road Accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సత్తంరాయ్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. దీంతో అదుపు కోల్పోయిన వాహనం రోడ్డుపక్కన ఉన్న బస్ స్టాప్ వైపు దూసుకెళ్లి అక్కడ నిలబడి ఉన్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. అనంతరం వారు బొలెరో వాహనం కింద నలిగిపోయారు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం కారణంగా శంషాబాద్–సత్తంరాయ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ (ఆర్జీఏ) పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

