Site icon NTV Telugu

CM KCR : కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు భేటీ

Cm Kcr

Cm Kcr

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్లాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె… గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజె ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చంతో సీఎం కేసీఆర్ ఘనంగా ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్ తో సుధీర్ఘంగా పలు అంశాల మీద లోతైన చర్చలు జరిగాయి. దేశానికే ఆదర్శంగా, అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన ఆరా తీసారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్ని వర్గాల ప్రజలకు ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిచడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ విధి విధానాలను తెలుసుకోవడానికి ఛత్రపతి శంభాజీ రాజె ఆసక్తిని కనబరిచారు. అందుకు సంబంధించిన అంశాలను సీఎం కేసీఆర్ ను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శంభాజీ రాజె తన ఆకాంక్షను వెల్లడించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి వుందని రాజె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలతో పాటు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై ఇరువురి నడుమ సుధీర్ఘ చర్చ సాగింది. దేశ ప్రజల అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత కోసం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండా ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని వారిరువురు అభిప్రాయపడ్డారు. అవసరమైతే సందర్భాన్ని బట్టి మళ్లీ వొకసారి కలుసుకుని అన్ని అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారు.

Also Read : Kangana Ranaut: నా జీవితం నాశనమైనా.. తిరిగి నిలబడే సత్తా ఉంది

ఈ సందర్భంగా …ఛత్రపతి శంభాజీ రాజ్ పూర్వీకులు శివాజీ మహారాజ్ నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సిఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. వారి స్పూర్తి తోనే, కుల మత వివక్షకు తావు లేకుండా తెలంగాణ లో ప్రజా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా…‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కి ఛత్రపతి శంభాజీ రాజె అందించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు ఛత్రపతి శంభాజీ రాజే తో పాటు వచ్చిన ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Exit mobile version