దక్షిణాఫ్రికా-ఎతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత్-ఎ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ వ్యవహరించనున్నారు. జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం చోటు దక్కలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ క్రికెటర్స్ సహా అభిమానూలు బీసీసీఐ, సెలెక్టర్లపై ఫైర్ అవుతున్నారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక ప్రక్రియలో మతపరమైన పక్షపాతం ఉందని, ముస్లిం కాబట్టే సర్ఫరాజ్‌కు చోటివ్వలేదని ఆరోపించారు.
‘ఇంటిపేరు కారణంగానే భారత్-ఎ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక కాలేదా?. జస్ట్ ఆస్కింగ్. ఈ విషయంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ వైఖరి ఏంటో మాకు తెలుసు’ అని షామా మొహమ్మద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయింది. షామా ట్వీట్‌ను బీజేపీ ఖండించింది. పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ… ‘ఈ నీచమైన ట్వీట్ కాంగ్రెస్ పార్టీ విభజన మనస్తత్వాన్ని చూపిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టును మతం ఆధారంగా విభజించడానికి ప్రయత్నిస్తోంది. దీనిని మేం ఖండిస్తున్నాం’ అని అన్నారు.
మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ కూడా షామా మొహమ్మద్ ఆరోపణను తోసిపుచ్చారు. ‘సర్ఫరాజ్ ఖాన్‌కు తగిన గౌరవం, అవకాశాలు లభించలేదని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. భారతదేశంలో క్రీడలలో ఇలా ఎప్పుడూ జరగలేదు’ అని పేర్కొన్నారు. సర్ఫరాజ్ విషయంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు. ఇండియా-ఎ జట్టుకు కూడా సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఎంపిక రాజకీయ దుమారం రేపుతోంది. చూడాలి మరి ఇది ఎక్కడివరకు పోతుందో.
