Mohsin Naqvi: ఆసియా కప్ ఫైనల్ అనంతరం జరిగిన ట్రోఫీ వివాదం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని చిక్కుల్లో పడేసింది. ట్రోఫీని గెలిచిన భారత జట్టుకు అందజేయకుండా ఆయన తీసుకెళ్లిపోవడం తీవ్ర దుమారం రేపింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో మూడుసార్లు ఓడిపోవడం, ఈ ఘటన పీసీబీ నాయకత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగా నక్వీ తాను నిర్వహించే రెండు ముఖ్యమైన పదవులలో ఒకదాన్ని వదులుకోవాలని, లేకపోతే రెండు పనులను సరిగా నిర్వహించలేరని డిమాండ్ పెరుగుతోంది.
పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది, నక్వీ ఒక పదవికి రాజీనామా చేయాలని కోరుతూ గళం విప్పారు. నక్వీ సాహెబ్‌కు నా అభ్యర్థన లేదా సలహా ఏమిటంటే.. మీకు రెండు చాలా ముఖ్యమైన పదవులు ఉన్నాయి. అవి రెండూ పెద్ద బాధ్యతలు. వాటికి తగినంత సమయం అవసరం అని అఫ్రిది అన్నారు. పీసీబీ అనేది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంటే పూర్తిగా భిన్నమైనది, కాబట్టి వాటిని వేర్వేరుగా ఉంచాలని నొక్కి చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రత్యేక శ్రద్ధ, సమయం అవసరమని, అందుకే ఈ నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని ఆయన కోరారు. తన సలహాదారులు సరైనవారు కాదని స్వయంగా నక్వీ చెప్పారని, అతనికి క్రికెట్ గురించి తెలిసిన సమర్థవంతమైన సలహాదారులు అవసరమని అఫ్రిది అన్నారు. నక్వీ తన పదవుల్లో ఒకదాన్ని వదులుకునేలా దేశ ఆర్మీ చీఫ్‌ను కూడా అభ్యర్థించారని కొన్ని వర్గాల సమాచారం.
Liquor : హైదరాబాద్‌లో రోడ్డుపై పడ్డ మద్యం సీసాలు.. ఎత్తుకెళ్లిన జనాలు
మొహ్సిన్ నక్వీ ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా, పీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాకుండా జై షా ఐసీసీకి వెళ్లిన తర్వాత, ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. ఈ మూడు ముఖ్యమైన బాధ్యతలతో ఆయన ఏ పనిపైనా సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారని విమర్శకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
