Site icon NTV Telugu

CWC 2025: దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ ప్రపంచ రికార్డులు!

Shafali Verma, Deepti Sharma, Harmanpreet Kaur

Shafali Verma, Deepti Sharma, Harmanpreet Kaur

2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈసారి హర్మన్‌ప్రీత్ సేన కప్ కొట్టింది. ఈ టైటిల్ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.

# షెఫాలీ వర్మ తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. వన్డే ప్రపంచకప్ (పురుషులు లేదా మహిళలు) సెమీ-ఫైనల్స్ లేదా ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలుగా రికార్డుల్లో నిలిచింది. షెఫాలీ 21 సంవత్సరాల 279 రోజుల వయసులో ఈ ఘనత సాధించింది.

# 2025 హిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించింది. మహిళల ప్రపంచకప్ గెలిచిన అతి పెద్ద వయసు కెప్టెన్ ఆమెనే. హర్మన్‌ప్రీత్ 36 సంవత్సరాల 239 రోజుల వయసులో ఈ ఘనత సాధించింది.

# మెగా టోర్నమెంట్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఒక జట్టు మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. పురుషుల టోర్నమెంట్‌లో ఇలా రెండుసార్లు జరిగింది. 1992లో పాకిస్తాన్, 2019లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.

# ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేసి.. ఐదు వికెట్లు పడగొట్టింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో (పురుషులు లేదా మహిళలు) అర్ధ సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్ దీప్తినే. వన్డే క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసి అర్ధ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ కూడా ఆమె. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌లో (పురుషులు లేదా మహిళలు) ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ మహిళ ఆమె. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు.

Also Read: Women’s ODI WC winners: వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమ్స్ ఇవే.. ఆ జట్టుకే ఎలా సాధ్యం!

# 2025 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో దీప్తి శర్మ 22 వికెట్లు తీసి 215 పరుగులు చేసింది. ఈ ప్రదర్శనకు దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైంది. 2025 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఒకే వన్డే ప్రపంచకప్ (పురుషులు లేదా మహిళలు)లో 200 పరుగులు, 20 వికెట్లు తీసిన తొలి క్రీడాకారిణి దీప్తినే. ఒకే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌లలో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచింది.

# మహిళల వన్డే ప్రపంచకప్ (భారతదేశం)లో అత్యధిక వికెట్లు:
43- ఝులన్ గోస్వామి
36- దీప్తి శర్మ
31- డయానా ఎడుల్జీ
30- నీతు డేవిడ్
30- పూర్ణిమ రౌ

మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు:
23- లిన్ ఫుల్‌స్టన్ (ఆస్ట్రేలియా), 1982
22- జాకీ లార్డ్ (న్యూజిలాండ్), 1982
22- దీప్తి శర్మ (భారతదేశం), 2025
21- సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), 2022
20- శుభంగి కులకర్ణి (భారతదేశం), 1982
20- నీతు డేవిడ్ (భారతదేశం), 2005

 

Exit mobile version