Site icon NTV Telugu

YS Viveka Case: ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!

Ys Viveka Case

Ys Viveka Case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో తాజాగా, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.. అంతా అతని సైగల్లోనే, కనుసన్నల్లోనే జరిగాయంటూ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ అభియోగాలు మోపుతోంది.. వైఎస్‌ వివేకా హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి.. వైఎస్‌ వివేకా ఇంటికి వెళ్లారని సీబీఐ చెబుతోంది.. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ వైఎస్‌ వివేకా ఇంట్లో ఉన్నట్లు తేలింది.. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేక మృతదేహానికి ఉదయ్‌ కుట్లు వేయించారు.. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు.. వివేక చనిపోయాడు అని తెలిసే వరకు ఇంట్లోనే ఉన్నారని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొన్నట్టు సీబీఐ వెల్లడించింది.

Read Also: Fake Encounters: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లు.. మాఫియాపై యోగి, అఖిలేష్ మధ్య వార్

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని పేర్కొన్న సీబీఐ.. బాత్‌రూమ్‌ నుండి వైఎస్‌ వివేకా డెడ్ బాడీని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని తెలిపింది.. అయితే, వివేక తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. అందులో భాగంగానే ఉదయ్‌ కుమార్‌ రెడ్డి.. తన తండ్రి అయిన ప్రకాష్‌రెడ్డితో వైఎస్‌ వివేకానందరెడ్డి తలకు కుట్లు వేయించినట్టు తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది సీబీఐ. వివేకానంద రెడ్డి గుండెపోటు అనే చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని.. గాయాలు కనపడకుండా ఉండేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని సంప్రదించి కుట్లు వేయించారని తెలిపింది.. చనిపోయిన వివేకా తలకు ప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ వేశాడు.. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించినా తమ సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. పారిపోతాడనేటువంటి అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశామని.. ఇంకా ఈ కేసులో విచారణ జరుగుతుంది.. మరి కొంతమందిని కూడా అరెస్టు చేస్తామని చెబుతున్నారు సీబీఐ అధికారులు. దీంతో, ఇప్పటికే చాలా మందిని విచారించిన సీబీఐ.. ఇంకా ఎవరిని అరెస్ట్‌ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version