Site icon NTV Telugu

Minister Seethakka : గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చలివేంద్రాల ఏర్పాటు..

Seethakka

Seethakka

Minister Seethakka : వేసవి దాహాన్ని తీర్చేందుకు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (పీఆర్‌ఆర్‌డీ) శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో భారీ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,090 చలివేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి.

మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలతో పీఆర్‌ఆర్‌డీ అధికారులు గ్రామాల నుంచీ రద్దీ ప్రాంతాల వరకు ప్రతి చోట చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు విరివిగా ఈ సేవలను వినియోగించుకుంటుండగా, మంత్రి సీతక్క విస్తృతంగా చలివేంద్రాల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా పీఆర్‌ఆర్‌డీ శాఖ ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లకు ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున పీఆర్‌ఆర్‌డీ సొంత నిధుల నుండి ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి. ఈ నిధులను అత్యవసర తాగునీటి అవసరాల కోసం ఖర్చు చేయాలని, మిషన్ భగీరథ నుండి నీరు అందని సందర్భాల్లో ప్రజలకు సమస్యలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గతంలో ఫైనాన్స్ శాఖ నుండి ప్రత్యేక నిధుల మంజూరుపై అనుమతులు ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నిధుల విడుదల జరగలేదని అధికారులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం పీఆర్‌ఆర్‌డీ సొంత నిధుల ఆధారంగా తక్షణ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ వేసవిలో గ్రామీణ ప్రజలకు తాగునీటిలో ఇబ్బందులు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పీఆర్‌ఆర్‌డీ స్పష్టం చేసింది.

Nagashvin : ఆ మూవీ ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లా : నాగ్ అశ్విన్

Exit mobile version