Site icon NTV Telugu

Minister Seethakka : బడిబాట తరహాలో పిల్లలను గుర్తించి అంగన్‌వాడీల్లో చేర్పించాలి

Seethakka

Seethakka

Minister Seethakka : తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు (DWOs) పాల్గొన్నారు. సీతక్క పేర్కొన్నట్టుగా, “పోషకాహార తెలంగాణే మన లక్ష్యం. అందుకు అంగన్‌వాడీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి.” రాష్ట్రంలో 313 అంగన్‌వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడాన్ని తప్పుపడుతూ, చిన్నారులు లేరనే సాకుతో వ్యవస్థను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.

సిబ్బందిని ఉత్తేజపరిచేందుకు త్వరలో గ్రేడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. మంచి గ్రేడింగ్ పొందిన సెంటర్ల సిబ్బందికి మరియు సంబంధిత జిల్లా అధికారులకు అవార్డులు అందిస్తామని చెప్పారు. అలాగే సరఫరా సామాగ్రిలో నాణ్యత లోపించినట్టయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. “బడిబాట తరహాలో పిల్లలను గుర్తించి అంగన్‌వాడీల్లో చేర్పించాలి” అని సూచించారు. ప్రస్తుతం 30 కేంద్రాల్లో ఒక్క చిన్నారి కూడా లేకపోవడం, 198 కేంద్రాల్లో 5 మంది లోపే ఉండటం, 586 కేంద్రాల్లో 10 మంది లోపే ఉండటం ఆందోళన కలిగించే విషయం అని మంత్రి వ్యాఖ్యానించారు.

కందిపప్పు కొనుగోళ్ల విషయంలో నిబంధనల ప్రకారం ఈ-టెండర్ విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్‌మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. సామ్, మామ్ ద్వారా బలహీన చిన్నారులను గుర్తించి నివేదికలు సమర్పించాలని, 50 శాతం కేసుల్లో అసలు రిపోర్ట్ చేయకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే బాల్యవివాహాలు, పిల్లల అమ్మకాలు, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగే దత్తత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Vivo V50e: 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్స్, 50MP కెమెరాతో లాంచైన వివో V50e

Exit mobile version