Secunderabad: సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేడ్ విలాస్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారి అరేలియాను సదరు విల్లాలోనే సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న విక్రమ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. స్కూల్ నుంచి వచ్చాక విల్లా ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని విక్రమ్ ఫాలో అయినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా నమోదైంది. అనంతరం పాపను కిడ్నాప్ చేసిన నిందితుడు, ఆమె కాళ్లు చేతులను బండరాయికి కట్టేసి ఆర్కేడ్ విల్లా క్లబ్ హౌస్ సెకండ్ సెల్లార్‌లోని వాటర్ సంప్‌లో పడేసి కిరాతకంగా చంపేశాడు. పాపను చంపేసిన తర్వాత నిందితుడు ఆమె తండ్రి మిల్టన్ ఫెర్నాండేజ్‌కు ఫోన్ చేసి, చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
మొదట కొడుకుని కిడ్నాప్ చేశానని చెప్పగా, బాబు ఇంట్లోనే ఉండటంతో పరిశీలించగా బిడ్డ అరేలియా కనిపించలేదు. ఆ తర్వాత పాపను చంపేసి సెల్లార్ వాటర్ సంప్‌లో పడేసినట్లు నిందితుడే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడని, తాము ఎంత బ్రతిమాలినా వినకుండా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సంపు నుంచి పాప మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విక్రమ్ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. హత్య అనంతరం అతడు సికింద్రాబాద్ వెళ్లినట్లు, రైల్వే స్టేషన్ సమీపంలో అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు వేగవంతం చేశారు. పాపను అత్యంత కఠినంగా పొట్టనబెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

