GST: దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎస్టీ ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి అక్టోబర్ 2022లో రూ.1,51,718 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్ వసూళ్లలో 16.6 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్‌జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్లు చెప్పింది.
Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన సర్కారు
జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా గత ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల వస్తు సేవల పన్ను వసూలైందని కేంద్రం పేర్కొంది. ఈ నెల వసూలైన రూ.1.51 లక్షల కోట్ల పైగా వచ్చిన జీఎస్టీ వసూళ్లు రెండో అత్యధికమని తెలిపింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లను గమనిస్తే.. ఏపీలో గత ఏడాది అక్టోబర్లో రూ.2,879 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 24% వృద్ధి నమోదైంది. తెలంగాణలో గత ఏడాది అక్టోబర్లో రూ.3,854 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 11 శాతం వృద్ధితో రూ.4,284 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.