స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లకు శుభవార్త అందించింది. ఖాతా తెరిచే ప్రక్రియను (క్లయింట్ ఆన్‌బోర్డింగ్) మరింత సులభతరం చేస్తూ, కేవైసీ (KYC) నిబంధనలను సడలించింది. ఒకే రకమైన పత్రాలను పదేపదే సమర్పించే ఇబ్బందిని తప్పిస్తూ, మధ్యవర్తిత్వ సంస్థల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు కీలక మార్పులను ప్రకటించింది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఖాతా ప్రారంభ ఫారమ్ రెండో భాగంలో ఉండే సాధారణ అదనపు సమాచారాన్ని ఇకపై కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ స్థాయిలోనే కేంద్రీకరిస్తారు. దీనివల్ల ఇన్వెస్టర్లు వేర్వేరు బ్రోకరేజ్ సంస్థల వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఒకే వివరాలను మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే సీకేవైసీ ఐడీ, డిజిపిన్, అధికారిక పత్రాల గడువు తేదీలను కేఆర్ఏ సిస్టమ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్ల మొబైల్ నంబర్ ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమై కేఆర్ఏ సిస్టమ్‌లో ధృవీకరించబడి ఉంటే, మధ్యవర్తిత్వ సంస్థలు దాన్ని మళ్లీ తనిఖీ చేయాల్సిన అవసరం లేదు.
పేరు మార్పు విషయంలోనూ సెబీ వెసులుబాటు కల్పించింది. పాన్ (PAN), ఆధార్ కార్డులలో పేరు మార్పు ఇప్పటికే అప్డేట్ అయి ఉంటే, అదనంగా ఎలాంటి ప్రత్యేక పత్రాలను సమర్పించనవసరం లేదు. ఒకవేళ ఆ రెండింటిలో మార్పు జరగకపోతే మాత్రం వివాహ ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద భారతీయ నివాసితులుగా అర్హత పొందిన ఓసీఐ కార్డుదారులు, విదేశీయులు తమ భారతీయ చిరునామా రుజువును సమర్పిస్తే, విదేశీ చిరునామా పత్రాలను ఇవ్వాల్సిన పనిలేదు.
ఇన్వెస్టర్ల సమాచార భద్రతకు కూడా సెబీ ప్రాధాన్యత ఇచ్చింది. ఖాతా మూసివేసినప్పుడు లేదా వరుసగా ఆరు నెలల పాటు మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో లావాదేవీలు లేకుండా సున్నా బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఐదు పనిదినాల్లోగా కేఆర్ఏకు సమాచారం ఇవ్వాలి. తద్వారా అనవసర సంస్థలతో ఖాతాదారుల వివరాలు పంచుకోవడం ఆగిపోతుంది. కేవైసీ వివరాలను ధృవీకరించినవి, ధృవీకరించనివిగా కేఆర్ఏలు వర్గీకరిస్తాయి. ఈ నూతన నిబంధనలు డిసెంబర్ 24 నుంచి అమల్లోకి రానున్నాయి.

