నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI అనుమతి ఇవ్వడంతో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2026 జూన్ 17న డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన NSEకి సెబీ సెప్టెంబర్ 4న అబ్జర్వేషన్ లెటర్ జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరులోనే బిఎస్‌ఈ (BSE) వేదికగా ఎన్‌ఎస్‌ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం సెప్టెంబర్ 11న ప్రైస్ బ్యాండ్ ప్రకటించి, అదే రోజున ఇష్యూ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 25 నాటికి కంపెనీ లిస్టింగ్ పూర్తికావచ్చు.
ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో రానుంది. ఎన్ఎస్ఈ కొత్తగా ఎలాంటి షేర్లను జారీ చేయడం లేదు, కాబట్టి ఐపీఓ ద్వారా వచ్చే నిధులు ఏవీ నేరుగా ఎక్స్ఛేంజ్‌కు వెళ్లవు. ప్రమోటర్లు, ప్రస్తుతం ఉన్న వాటాదారులు దాదాపు 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మకానికి ఉంచుతున్నారు. ఇది NSE మొత్తం పెయిడ్-అప్ క్యాపిటల్‌లో సుమారు 6 శాతానికి సమానం. అన్‌లిస్టెడ్ మార్కెట్‌లోని అంచనాల ప్రకారం ఈ ఐపీఓ విలువ దాదాపు రూ. 30,000 కోట్లుగా ఉండవచ్చని భావిస్తున్నారు. కంపెనీ మొత్తం వ్యాల్యుయేషన్ రూ. 5 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,870 కోట్లు) రికార్డును అధిగమించి, భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరిస్తుంది.
ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో ఎస్‌బీఐ గ్రూప్ అత్యధికంగా 2.475 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. వీటితో పాటు MS స్ట్రాటజిక్ (మారిషస్) 1.60 కోట్లు, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB) 1.19 కోట్లు, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్ 1.12 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.10 కోట్లు మరియు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1.09 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. జీఐసీ రీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు పలువురు వ్యక్తిగత వాటాదారులు కూడా తమ వాటాలను విక్రయిస్తున్నారు. భారత్‌లోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఇది సాధారణ ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారనుంది.

