Site icon NTV Telugu

Viral Video: ఆడపిల్ల కాదు ఆడపులి.. ఆటోను అమాంతం లేపి తల్లిని కాపాడిన బాలిక! వీడియో వైరల్‌

Mangaluru Girl Video

Mangaluru Girl Video

Mangaluru Girl Lifts Auto To Rescue Mother: ‘ఆడపిల్ల’ అని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపద వస్తే ‘మహంకాళి’గా మారుతుంది. కళ్ల ముందు ఆపద ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనగడుగు వేయదు. ఇక కన్న తల్లికి ఏదైనా జరిగితే ఊరుకుంటుందా?.. క్షణం కూడా ఆలోచించదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన తల్లిని కాపాడేందుకు.. బోల్తాపడిన ఆటోను అమాంతం పైకి లేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం… మంగళూరులోని కిన్నీగోళి రామనగర్‌లో ఓ మహిళ ఆవలివైపు ఉన్న తన కుమార్తె కోసం రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. తన స్కూటీని పార్క్ చేసిన మహిళ వేగంగా నడుస్తూ రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో ఓ ఆటో వచ్చి ఆమెను ఢీకొట్టింది. తల్లిపై ఆటో పడటం చూసిన స్కూల్‌ విద్యార్ధిని మెరుపు వేగంతో పరుగెత్తుకెళ్లింది. తన రెండు చేతులతో ఆటోను అమాంతం లేపి తల్లిని కాపాడుకుంది. ఆ సమయంలో ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండడం గమనార్హం. తల్లిని కాపాడుకోవాలనే తాపత్రయంలో బాలికకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి.

Also Read: Iphone 16 Launch: నేడే ‘ఐఫోన్ 16’ సిరీస్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిసింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న ఓ షాపు సీసీటీవీలో రికార్డయ్యాయి. తల్లిని కాపాడిన బాలికను అందరూ అభినందిస్తున్నారు. గాయపడిన మహిళను రాజరత్నాపూర్‌కు చెందిన చేతన (35)గా పోలీసులు గుర్తించారు. ట్యూషన్‌కు వెళ్లిన తన కూతురిని తీసుకురావడానికి వెళ్లిన చేతన.. ట్యూషన్ సెంటర్ దగ్గర ప్రమాదానికి గురైంది.

Exit mobile version