Site icon NTV Telugu

SCCL: ఒడిశాలో సింగరేణి తొలి అడుగు.. నేడు నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభం

Sccl

Sccl

SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయిగా నేడు ఒడిశాలో నైనీ బొగ్గు గని ప్రారంభమైంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది. హైదరాబాద్‌ నుంచి నైనీ గనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గని ప్రారంభం ద్వారా సింగరేణి కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రత్యేక చొరవ కీలకపాత్ర పోషించాయి. తొమ్మిదేళ్ల కల సాకారమవడం సంస్థకు, కార్మికులకు గర్వకారణంగా మారింది.

ఈ నైనీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, గని జీవితం 38 ఏళ్లుగా అంచనా వేయబడింది. ఇది ఒక మెగా ప్రాజెక్టుగా భావించవచ్చు. గనిలో వనరుల వినియోగం, ఆర్థిక లాభాల దృష్టితో సంస్థ ఎదుగుదలకు ఇది బలమైన దశగా నిలవనుంది. ఒడిశాలోని నైనీ గని వద్ద నిర్వహిస్తున్న ప్రారంభ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ గని ప్రారంభంతో సింగరేణి సుదీర్ఘ స్వప్నం సాకారమైనందున కార్మికుల మధ్య హర్షాతిరేకాలు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాలలో ప్రభావాన్ని చూపిస్తూ దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతున్న సింగరేణికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది.

Exit mobile version