NTV Telugu Site icon

Scam Alert: మరో కొత్త తరహా మోసాలు.. జీమెయిల్‌ యూజర్లే లక్ష్యం!

Cyber Scam

Cyber Scam

Gmail Account Recovery Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కాల్స్, యూపీఐ చెల్లింపులు, గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్‌ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్‌ అకౌంట్‌ రికవరీ రిక్వెస్టులు పంపి యూజర్ల చేత ఆప్రూవ్‌ చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్‌ క్లిక్‌ చేస్తే.. వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెలుతుంది. మీరు జీమెయిల్‌లో భద్రపరుచుకున్న సమాచారం అంతా వారికి తేలిపోతుంది.

ఐటీ కన్సల్టెంట్‌, టెక్‌ బ్లాగర్‌ సామ్‌ మిట్రోవిక్‌ తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తెలిపారు. స్కామ్‌లో భాగంగా ముందుగా అకౌంట్‌ రికవరీ పేరిట మీ ఫోన్‌కు నోటిఫికేషన్‌ లేదా మీ జీమెయిల్‌కు మెయిల్‌ వస్తుంది. ఈ నోటిఫికేషన్‌ లేదా మెయిల్‌ వేరే దేశం నుంచి వస్తుంది. మిట్రోవిక్‌కు అమెరికా నుంచి ఈ రిక్వెస్ట్‌ వచ్చింది. ఒకవేళ ఆ నోటిఫికేషన్‌ను మీరు రిజెక్ట్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్లు ప్లాన్‌-బి అమలు చేస్తారు. గూగుల్‌ నుంచి చేసినట్లు ఓ కాల్‌ వస్తుంది. తాను గూగుల్‌ ఉద్యోగిని అంటూ ఫోన్‌ చేసి నమ్మిస్తారు.

‘మీ అకౌంట్‌ను విదేశాల్లో ఎవరో వాడేందుకు ప్రయత్నించారు. నోటిఫికేషన్‌ లేదా మెయిల్‌ను యాక్సెప్ట్‌ చేసుంటే మీరు ప్రమాదంలో పడతారు’ అంటూ చెబుతారు. మరిన్ని విషయాలు కూడా చెప్పి భయపెడతారు. యూజర్‌ను నమ్మాక.. గూగుల్‌ పేరిట ఓ మెయిల్‌ పంపిస్తారు. నిజానికి అది ఫేక్‌ మెయిల్‌. ఒకవేళ లింక్ క్లిక్ చేస్తే.. మీ జీమెయిల్‌ ఖాతా పూర్తి యాక్సెస్‌ వారి చేతిలోకి వెళుతుందని మిట్రోవిక్‌ తెలిపారు. స్కాముల పట్ల యూజర్లు అవగాహన పెంచుకోవడం ద్వారానే ఇలాంటి వాటి నుంచి తపించుకోవచ్చని మిట్రోవిక్‌ చెప్పారు. అకౌంట్‌ రికవరీ పేరిట వచ్చే రిక్వెస్టులను ఆమోదించకూడదని, ఎవరైనా గూగుల్ పేరిట కాల్‌ చేస్తే నమ్మొద్దని చెప్పుకొచ్చారు.