Site icon NTV Telugu

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!

Ambati Rambabu

Ambati Rambabu

వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన కారణంగా.. ఆయనపై సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల భార్గవ్‌ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర అంబటి తన సోదరుడు మురళితో కలిసి బ్యారికేడ్స్ తొలగించి హంగామా చేశారు.

Also Read: ENG vs IND: సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్‌

మాజీ సీఎం వైఎస్ జగన్‌ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వర­రావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. జగన్‌ ర్యాలీ సందర్భంగా కంటెపూడి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్ జగన్‌ కాన్వాయ్‌తో పాటు మరికొన్ని వాహనాలు ముందుకెళ్లగా.. రద్దీని నియంత్రించేందుకు వెనుక ఉన్న వాహనాలను పోలీసులు ఆపేశారు. వాహనాలను ఎందుకు ఆపారని, వెంటనే పంపాలని పోలీసులతో అంబటి రాంబాబు వాదనకు దిగారు. జగన్‌ కాన్వాయ్‌కు ఇబ్బంది కలగకూడదనే వాహనాల్ని ఆపామని పోలీసులు వివరించినా.. ఆయన వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను నెట్టేశారు. అడ్డుచెప్పిన పోలీసులపై నోరు పారేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంపై సత్తెనపల్లి పోలీసులు అంబటిపై కేసులు నమోదు చేశారు.

Exit mobile version