భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ నుంచి సమాచారం బయటకు చేరవేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు తన కుటుంబం చాలా బాధపడిందని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెప్పారు. ఆ సమయంలో తన తండ్రి చాలా విచారంగా ఉన్నారని, తన భార్య కూడా ఏడ్చిందని వెల్లడించారు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారని సర్ఫరాజ్ తెలిపారు.
2024-25లో ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో జట్టు డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు చెప్పారనే ఆరోపణలు సర్ఫరాజ్ మీద వచ్చాయి. ఆ ఆరోపణల వల్ల తనకు బాధ కలిగినా, వాటి వల్ల తన తల్లిదండ్రులు, భార్య ఇబ్బంది పడటమే తనను మరింత కలవరపెట్టిందని ఆయన అన్నారు.
ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన సర్ఫరాజ్, ఆరోపణల తర్వాత తాను ఫోన్ ఆఫ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. రెండు రోజుల తర్వాత గౌతమ్ గంభీర్ ఫోన్ చేసి, అదంతా పట్టించుకోవాల్సిన విషయం కాదని, అలాంటి రాజకీయాల్లో పడకుండా ఆట మీద దృష్టి పెట్టాలని చెప్పారన్నారు. తన తండ్రి నౌషాద్ బాధపడుతున్నారని, భార్య ఏడుస్తోందని చెప్పగానే, గంభీర్ తన తండ్రితో కూడా మాట్లాడారని తెలిపారు. ఆ మాటలను పట్టించుకోవద్దని, సర్ఫరాజ్ మంచి ఆటగాడు కాబట్టి ప్రశాంతంగా ఆడనివ్వాలని గంభీర్ ధైర్యం చెప్పారని, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పారని సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు లోపల వాతావరణం సరిగా లేదన్న వార్తలు వస్తున్న సమయంలో ఈ ఆరోపణలు వచ్చాయి. నాలుగో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ ఆటగాళ్లను గట్టిగా మందలించారన్న వార్తలూ వినిపించాయి. ఆ సిరీస్‌లో సర్ఫరాజ్ జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాలేదు.
దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడుతున్నా, ఫిట్‌నెస్ పెంచుకున్నా మళ్లీ భారత జట్టులోకి అవకాశం రాకపోవడంపై ఇటీవల సర్ఫరాజ్ నిరాశ వ్యక్తం చేశారు. రంజీ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, ఉదయం లేవగానే తనకు ఇంత కష్టపడటం ఎందుకనే ప్రశ్న వస్తోందని అన్నారు.

