బాలనటిగా అడుగుపెట్టి, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా మెరుస్తున్న అందాల భామ సారా అర్జున్ తన కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రణ్‌వీర్ సింగ్ సరసన ‘ధురంధర్’ సినిమాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘యుఫోరియా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. తనకు అనవసరమైన స్టార్ ట్యాగ్‌ల కంటే, తన నటనతో వచ్చే గుర్తింపే ముఖ్యమని స్పష్టం చేసింది. కెరీర్‌లో తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ పరిణితి చెందుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : S Janaki : సింగర్ ఎస్.జానకి ఇంట్లో తీవ్ర విషాదం..
‘నా పనితో ప్రేక్షకులపై ఒక బలమైన ముద్ర వేసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది. అప్పటి వరకు తలదించుకుని కష్టపడటానికే నేను ఇష్టపడతాను’ అని సారా తన డెడికేషన్‌ను చాటుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటానని ఆమె పేర్కొంది. ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సారా, ఇప్పుడు హీరోయిన్‌గా మారుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తన వృత్తిపై ఉన్న నిబద్ధతను చాటుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో రాబోతున్న ‘యుఫోరియా’ సినిమా తన కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని సారా ధీమా వ్యక్తం చేస్తోంది.
