NTV Telugu Site icon

Bhogi 2025: లక్ష 116 పిడకలను తయారు చేసిన మహిళ.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!

Bhogi Pidakalu

Bhogi Pidakalu

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో బోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం.. ఇంటి నుండి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి. ప్రతి ఏటా బోగి సమయానికి గ్రామంలో ప్రతి ఒక్కరు 116 నుండి 1116 వరకు ప్రతి ఒక్కరు బోగి మంటల్లో పిడకలు వేయడం వారి సాంప్రదాయంగా మలుచుకున్నారు. ఇలా గ్రామంలో అలవాటుగా మారిన ఈ సాంప్రదాయం కోసం వివాహం అయినా ఆడపడుచులు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా.. సంక్రాంతి వచ్చే సమయంలో నెల ముందే ఈ గ్రామానికి కుటుంబ సమెతంగా చేరుకుంటారు.

సంక్రాంతి నేలగంట పట్టినప్పుడు నుండి వారి ఇళ్లలో ఉన్న గోవులకు పసుపు, కుంకుమతో శుద్ధి చేస్తారు. ప్రత్యేక శ్రద్ధతో ఆవు మూత్రంను, పెడను సేకరించి.. పిడకలను తయారు చేస్తారు. అప్పటి నుండి తయారు చేసిన పిడకలను ఎండబెట్టి దండలుగా తయారు చేస్తారు. అయితే గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోగి సమయంలో మంటల్లో కనీసం ఒక్క పిడక అయినా వేయడం సంప్రదాయంగా ఉన్నా.. ఈ గ్రామంలో లక్ష్మి అనే మహిళా లక్ష పిడకలతో బోగి మంటకు సిద్దమయ్యారు. గత 11 ఏళ్లుగా ఇదే పద్దతిని ఆమె పాటిస్తున్నారు. ప్రతి ఏటా నెల గంట పెట్టినప్పుడు నుండి పెడను సేకరించి నెల రోజుల వ్యవధిలో లక్ష పిడకలను తయారు చేస్తారు. సాంప్రదాయ దుస్తులతో బోగి మంటలను వేసి.. పిడకలు అందులో వేస్తున్నారు.

ప్రతి ఏటా వేసే లక్ష పిడకలకు బదులుగా.. ఈసారి లక్ష నూట పదహారు పిడకలను బోగి మంటకు సిద్ధం చేశానని లక్ష్మి తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమం వల్ల పాడి పంటలు, అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. లక్ష పిడకలు వేయడంతో లక్ష్మి కాంతులతో వచ్చే లక్కు కోసం ప్రతి సంక్రాంతికి ఎదురు చూస్తున్నానంటూ రామలక్ష్మి అనే మహిళ అంటున్నారు. మరో పక్క ఇతర రాష్ట్రాల నుండి ఈ గ్రామంలో బోగి రోజున వేసే పిడకల సాంప్రదాయంలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాము కూడా బోగి మంటల్లో పిడకలు వేయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. లక్ష 116 పిడకలను చూసేందుకు ఇప్పటికే జనాలు క్యూ కడుతున్నారు. దాంతో రాపాక గ్రామం జన సందడిగా మారింది.

Show comments